_
🕉️🌞🟡🕉️🟡🌞🕉️🌞🕉️
ఉగస్య ఆది అనేదే ఉగాది. "ఉగ" అనగా నక్షత్ర గమనం - జన్మ - ఆయుష్షు అని అర్థాలు. వీటికి 'ఆది' అనగా మొదలు 'ఉగాది'. ప్రపంచం జన్మ ఆయుష్షులకు మొదటిరోజు కనుక ఉగాది అయింది. ఇంకొకవిధంగా చెప్పాలంటే, 'యుగం' అనగా రెండు లేక జంట అని కూడా అర్ధం. ఉత్తరాయణ, దక్షిణాయనములనబడే ఆయన ద్వయ సంయుతం 'యుగం' (సంవత్సరం) కాగా, ఆ యుగానికి ఆది యుగాది అయింది.
''ఉగ'' అంటే నక్షత్ర నడక అని, ''ఆది'' అంటే మొదలు అని అర్ధం. సృష్టి ఆరంభం లేదా కాలం మొదలవడాన్ని ''ఉగాది'' అన్నారు. మరోరకంగా చూస్తే ''యుగం'' అంటే రెండు అనే అర్ధం ఉంది. అంటే ఒకటి కాలం, రెండోది గ్రహాలు. కాలం రాశులలో ప్రవేశించడాన్ని బట్టి ''యుగము'' అన్నారు. ''యుగం'' ప్రారంభమైన రోజు కనుక ''యుగాది'' అన్నారు. అదే క్రమంగా ''ఉగాది''* అయింది. చైత్ర శుద్ధ పాడ్యమి చాంద్రమాన ఉగాది లేదా యుగాది పండుగ.
చైత్ర శుద్ధ పాడ్యమినే కొత్త సంవత్సరంగా అంగీకరించడానికి, వేడుక చేసుకోడానికి కారణం ఋతువులు. నెలల కంటే ఋతువులు ప్రధానమైనవి. చైత్రమాసానికి శిశిర ఋతువు పోయి వసంత ఋతువు... అంటే చలికాలం పోయి వేసవికాలం వస్తుంది. ఆకులు రాలే కాలం అయిపోయి చెట్లు చిగుర్చి పూత పూస్తాయి. మల్లెలు గుబాళిస్తాయి. పక్షుల ఈకలు ఊడి కొత్తవి వస్తాయి. ఈ నెలతో చెట్లు చిగురించడం మొదలై పూత, పిందెలు, పండ్లు - ఇలా అంతా లబ్దికరంగా సాగుతుంది. శరీరంలో పైకి కనిపించే మార్పులే కాదు. మానసికంగా కూడా చైత్రమాసం నుండి ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటుంది. ఈ కారణంగానే చైత్రమాసంలో ఉగాదిని జరుపుకుంటాం.
* *నూతన సంవత్సర కీర్తనాత్ ప్రారంభః ప్రతి* *గృహ ధ్వజారోహణం నింబ పత్రాశనం* *
సంవత్సర పంచాంగ శ్రవణం నవరాత్రారంభః* సంవత్సరాదిని అంటే కొత్త సంవత్సరాన్ని కీర్తిస్తూ తలస్నానం చేయడంతో దినచర్య మొదలౌతుంది. ధ్వజారోహణం చేయాలి. కొన్ని వేపాకులు నమలాలి. వేపపూత కలిపి చేసిన ఉగాది పచ్చడి తినాలి. కొత్త దుస్తులు ధరించి నిత్యకర్మ పూర్తి చేసుకుని పంచభక్ష్య పరమాన్నాలతో భోజనం చేసి పంచాంగ శ్రవణం చేయాలి. ఉగాది పచ్చడి తినడంవల్ల
* *శతాయుష్యం వజ్రదేహం దదాత్యర్ధం సుఖానిచ*
*సర్వారిష్ట వినాశనం చ నింబ కందళ భక్షణం*
వేపపూత, బెల్లం తినడం వల్ల శరీరం వజ్రంలా గట్టిపడుతుంది. సర్వసంపదలు వస్తాయి. ఎలాంటి కష్టాలైనా తీరిపోతాయి. శాస్త్రం ప్రకారం చూస్తే చైత్ర మాసంలో భూమి సూర్యునికి చాలా దగ్గరగా ఉంటుంది. కనుకనే గ్రీష్మ తాపం ఎక్కువగా ఉంటుంది. ఈ వేడివల్ల కొన్ని రకాల వ్యాధులు రావడానికి, ప్రబలడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఈ ఉపద్రవాన్ని నివారించడానికి వేపపూత, బెల్లం తోడ్పడతాయి.
శాలివాహన చక్రవర్తి చైత్రశుక్లపాడ్యమినాడే పట్టాభిషిక్తుడై తన శౌర్యపరాక్రమాలతో శాలివాహన యుగకర్తగా భాసిల్లిన కారణాన ఆ యోధాగ్రని స్మృత్యర్థం ఉగాది ఆచరింపబడుతుందని చారిత్రక వృత్తాంతం.
అనేక పురాణ కథల్లో ఉగాది ప్రస్తావన కనిపిస్తుంది. విష్ణుమూర్తి మత్స్యావతారం ఎత్తింది చైత్ర శుద్ధ పాడ్యమి నాడే అని పురాణ కథనం.